ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘాల సమన్యయ సమితి

మార్చి 14న ఛలో ఢిల్లీరాష్ట్రంలో గ్రామ, గ్రామాన ప్రచారం, మండల కేంద్రాల్లో ఆందోళనలు నిర్వహించాలి.



విజయవాడ: డాక్టర్‌ యం.ఎస్‌.స్వామినాథన్‌ కమిటీ సిఫార్సుల ప్రకారం అన్ని పంటలకు సీ2+ 50% కలిపి మద్దతు ధరలు ప్రకటించి చట్టం చేయాలని, ఒక పర్యాయం దేశవ్యాప్తంగా రైతు, కౌలురైతుల పంట రుణాలను మాఫీ చేసి ఆత్మహత్యల నుంచి రైతాంగాన్ని కాపాడాలని, కేరళ తరహాలో రుణ ఉపశమన చట్టం తేవాలని అఖిల భారత కిసాన్‌ సభ జాతీయ అధ్యక్షులు, సంయుక్త కిసాన్‌ మోర్చా జాతీయ నాయకులు రావులవెంకయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. గత రైతాంగ ఉద్యమం సందర్భంగా రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మార్చి 14న ఢిల్లీలో మహా పంచాయత్‌ (బహిరంగసభ) సభను నిర్వహిస్తున్నామని ఈ సభలో పెద్ద ఎత్తున రైతాంగం పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమంపై కేంద్ర ప్రభుత్వ ధమనకాండను తీవ్రంగా ఖండించారు రైతుల మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నేడు ( ఆదివారం) విజయవాడలోని మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రకాశం జిల్లా అభివృద్ధి వేదిక కన్వీనర్‌ చుండూరు రంగారావు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘాల సమన్వయ సమితి సమావేశం జరిగింది. అనంతరం విలేకరుల సమావేశం కూడా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రావుల వెంకయ్య మాట్లాడుతూ సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు మేరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుంచి మార్చి 14 తేదీన ఢిల్లీలో జరుగుతున్న సభకు రైతులు పెద్దసంఖ్యలో హాజరు కావాలని పిలుపునిచ్చారు. మోడీని గద్దె దించాలని బిజెపి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని, కార్పొరేట్‌ రంగాన్ని బహిష్కరించాలని రైతాంగాన్ని కోరారు. ఇటీవల ఢిల్లీలోలో జరుగుతున్న రైతుఉద్యమంలో పంజాబ్‌ యువ రైతు శుభ్‌ కరణ్‌ సింగ్‌ను హర్యానా రాష్ట్ర ప్రభుత్వ  పోలీసులచే కేంద్రప్రభుత్వం కాల్పులు జరిపించి బలితీసుకుందన్నారు.  ఈయనతో పాటు మరో నలుగురు రైతులు ప్రస్తుతం జరుగుతున్న ఉద్యమంలో మరణించారని రైతు వ్యతిరేక, కార్పొరేట్‌ అనుకూల విధానాలు అవలంబిస్తున్న ఈ బిజెపి ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో గద్దె దించేందుకు రైతాంగమంతా ఐక్యం కావాలని ఆయన రైతాంగానికి పిలుపునిచ్చారు. రైతుసంఘం సీనియర్‌ నాయకులు వై.కేశవరావు  మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతాంగంతో సంప్రదించకుండానే విద్యుత్‌ బిల్లును పార్లమెంట్‌లో పెట్టిందని ఈ బిల్లును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందకుండానే రాష్ట్రంలోని వైకాపా ప్రభుత్వం వ్యవసాయ మోటార్లకు స్మార్ట్‌ మీటర్లు బిగించడం చాలా దుర్మార్గమన్నారు. మీటర్ల బిగించడాన్ని వెంటనే నిలుపుదల చేయాలని కోరారు. సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపులందుకొని ఫిబ్రవరి 16న గ్రామీణ బంద్‌, 23న బ్లాక్‌ డే, 26న ట్రాక్టర్ల  ర్యాలీలను జయప్రదం చేసిన కార్మిక, కర్షకులకు అభినందనలు తెలియజేశారు. అదే స్ఫూర్తితో మార్చి 14న జరిగే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టుకు నిధులను మంజూరు చేయాలని, నిర్వాసితులకు పూర్తి పునరావసం, నష్టపరిహారం ఇవ్వాలని బంజరు భూములు కూడా చట్టం ప్రకారం పూర్తి నష్టపరిహారం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కారుసాల సుబ్బారావమ్మ, ఎఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ కార్యదర్శి యం. వెంకటసుబ్బయ్య, ఇప్టు కార్యదర్శి పోలారి తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే నాలుగు లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం రూ॥ 26,000 ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని, విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ నిలుపుదలను చేయాలని, కడప ఉక్కును వెంటనే నిర్మించాలని, కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతాంగం చేపట్టిన ఉద్యమంలో కార్మిక రంగం భాగస్వామి కావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ కౌలురైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. జమలయ్య మాట్లాడుతూ సాగులో ఉన్న కౌలు రైతులందరికీ  ఇన్‌పుట్‌ నష్టపరిహారం చెల్లించాలని, రైతు,కౌలురైతుల ప్రయోజనాలకు అనుగుణంగా సమగ్ర పంటల భీమా పథకాన్ని తీసుకురావాలని, వాస్తవ సాగుదారులైన కౌలురైతులకే భీమాపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. మార్చి 14 కార్యక్రమం గురించి రాష్ట్రంలోనే అన్ని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని, మండల కేంద్రాల్లో నిరసన,ప్రదర్శనలు చేపట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య మాట్లాడుతూ డబ్ల్యుటిఓ ఒప్పందం మన దేశ రైతాంగ ప్రయోజనాలకు తీవ్రమైన నష్టం చేస్తుందని,ఇప్పుడు వరకు జరిగిన నష్టం వల్ల రైతాంగం తీవ్రసంక్షోభంలో కూలిపోయారని, ఒప్పందం నుంచి భారతదేశం బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్నీడు యల్లమందారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్లకు ఊడిగం చేస్తుందని, వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తుదని  మోడీ విధానాలను ఎండగట్టారు. ఆల్‌ ఇండియా కిసాన్‌ మహాసభ రాష్ట్రప్రధాన కార్యదర్శి డి.హరినాథ్‌ మాట్లాడుతూ రైతుల భూమి హక్కులకు నష్టం చేసే వైకాపా ప్రభుత్వం తెచ్చిన భూమి యాజమాన్య హక్కుల చట్టాన్ని రద్దు చేయాలని, చుక్కల భూములకు, బంజర భూములకు అన్నిటికి పట్టాలు ఇవ్వాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌ జాగృతి రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరీదు ప్రసాద్‌ బాబు మాట్లాడుతూ ఆహార భద్రత చట్టాన్ని పటిష్ట పరచాలని ఉపాధి హామీకి కేంద్ర బడ్జెట్‌ లో రెండు లక్షల కోట్లు రూపాయలు కేటాయించి 200 రోజులకు పెంచాలని, వేతనం రూ.600ఇవ్వాలని డిమాండ్‌ చేశారు డిమాండ్‌ చేశారు. ఎం కె.ఎం.ఎస్‌ రాష్ట్ర నాయకులు యు.వీరబాబు, ఏఐకేఎఫ్‌ రాష్ట్ర నాయకులు గొల్లపూడి ప్రసాద్‌లు మాట్లాడుతూ హర్యానా బోర్డర్‌ లో రైతులపై కాల్పులు జరిపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం డిమాండ్‌ చేశారు. ఏపీ కౌలురైతులసంఘం కార్యదర్శి ఎం. హరిబాబు మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ రైతాంగ ఆత్మహత్యలకు కారణమైన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా గ్రామ,గ్రామాన రైతుల్లోప్రచారం నిర్వహించి ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు. ఎంకెఎంఎస్‌ రాష్ట్ర నాయకులు వి నరసింహారావు మాట్లాడుతూ ఆటవీహక్కుల చట్ట సవరణలను  ఉపచారించుకోవాలని, ఆదివాసుల హక్కులను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో డెల్టా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కొలనకొండ శివాజీ ,రైతు సంఘం నాయకులు జి రంగారెడ్డి, పంచుమాటి అజయ్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు ఆర్‌ వి నరసింహారావు, కాసాని గణేష్‌, వెంకటరెడ్డి బాబాయి తదితరులు పాల్గొన్నారు.