మహిళ హక్కుల రక్షణకై పోరాడుదాం....

మహిళ హక్కుల రక్షణకై పోరాడుదాం....ఉత్తరాంధ్ర మహిళా సంఘం అధ్యక్షురాలు పి. నాగమణి పిలుపు



మందస(శ్రీకాకుళం):-అంతర్జాతీయ శ్రామిక మహిళ పోరాట దినాన్ని ఉత్తరాంధ్ర మహిళా సంఘం మందస మండలం సువర్ణ పురం గ్రామంలో సభను శుకృవారం నిర్వహించింది.



ఈ సభలో అధ్యక్షురాలు పి. నాగమణి సభను ఉద్దేశించి మాట్లాడుతూ రాష్ట్రంలో స్త్రీలపై హింస రోజురోజుకీ పెరిగిపోతున్నదని స్త్రీలు అనేక రూపాల్లో హింసకు గురౌతూ చనిపోతున్నారని, ఈ హింసకు వ్యతిరేకంగా మహిళలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సంఘ ఉపాధ్యక్షురాలు యు.జ్యోతి మాట్లాడుతూ స్త్రీలపై జరుగుతున్న హింసకు సామాజిక ఆమోదం లభిస్తుందని ఈరోజుకి స్త్రీలను కొట్టవచ్చు అన్న హక్కు భర్తలకు ఈ సమాజం ఇచ్చిందని మాట్లాడారు. మహిళలంటే విలాస వస్తువుగా కోరికలు తీర్చే బానిసలుగా, పిల్లలకనే యంత్రాలుగా ఈ సమాజం పరిగణిస్తుందని, ఈ పిత్రృస్వామిక ధోరణికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సభకు ప్రధాన వక్తగా హాజరైన పౌర హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు పత్తిరి దానేష్ మాట్లాడుతూ దశాబ్దాలుగా మహిళలు 33% రిజర్వేషన్ కోసం పోరాడి సాధించుకున్న బిల్లు 2029 నాటికి గాని వచ్చే అవకాశం లేదని, ఈ ఒక్క విషయము పరిశీలిస్తే ఈ దేశంలో రాజకీయ పార్టీలు ఎంతటి పురుషాధిపత్యం కలిగి ఉన్నాయో అర్థమవుతుందని తెలియజేశారు. ముఖ్యంగా స్త్రీలు నాలుగు రకాలుగా హింసకు గురవుతున్నారని ఒకటి కుటుంబ హింస, రెండు లైంగిక హింస, మూడు రాజకీయపరమైన హింస, నాలుగు రాజ్య హింస, ఈ నాలుగు హింసల్ని ప్రధానంగా ఎదుర్కొంటున్నారని వివరంగా తెలియజేశారు. పిడిఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరాస్వామి మాట్లాడుతూ స్త్రీలు స్వేచ్ఛగా, భద్రతగా జీవించే వాతావరణం కావాలని, ఆ స్వేచ్చకై పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ సభలో ప్రజా కళా మండలి రాష్ట్ర సహాయ కార్యదర్శి నీలకంఠం, జిల్లా కార్యదర్శి చిరంజీవిలు, కుమారు మహిళల పాటలతో గ్రామానంత ఉత్తేజపరిచారు. సువర్ణపురం ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ సభను విజయవంతం చేశారు.