పాతాళానికి తొక్కినా తిరిగి ఆకాశానికి ఎగరగలిగిన శక్తి కమ్యూనిజానిది

పాతాళానికి తొక్కినా తిరిగి ఆకాశానికి ఎగరగలిగిన శక్తి కమ్యూనిజానిది- సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు.

 


పాతాళానికి తొక్కినా తిరిగి ఆకాశానికి ఎగరగలిగిన శక్తి కమ్యూనిజానికుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతిని పురస్కరించుకొని విశాఖపట్నంలోని అల్లూరి విజ్ఞాన్‌ కేంద్రంలో స్మారకోపన్యాసం నిర్వహించారు. ‘ మతోన్మాదం-రాజ్యాంగం-ప్రస్తుత సవాళ్లు ‘ అనే అంశంపై నేతలు ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రసంగిస్తూ మార్క్స్‌ కమ్యూనిస్టు ప్రణాళికను రాసినప్పుడు కమ్యూనిజానికి భూతం ఆవరించిందంటూ అమెరికా వ్యంగ్యాస్త్రాలు రాసింది కానీ వాస్తవానికి అమెరికానే ఈరోజు భయం అనే భూతం ఆవరించిందన్నారు. ఆసియా ఖండాలపై చైనా పలుకుబడిని దెబ్బతీసి అమెరికా తన ఆధిపత్యాన్ని పెంచుకోవాలని చూస్తుందని, దీనికి కారణం కమ్యూనిజం ఎక్కడ వస్తుందోనన్న భయం.. అని అన్నారు. ప్రస్తుత భారతదేశంలో ప్రధాని మోడి ఎక్కడైనా చైనాను తిట్టకుండా ఉండటం లేదని అన్నారు. ఈరోజు భారతదేశంలో విదేశీ వ్యాపారంలో ప్రధానంగా ఉన్నది చైనానే అన్నారు. చైనాతో వ్యాపారం లాభాలు వారికి కావాలి కానీ చైనా కమ్యూనిజం వారికొద్దని ఇదే నేటి పెట్టుబడిదారీ విధానం అని చెప్పారు. కమ్యూనిజం తొక్కితే అణిగిపోయేది కాదని, ఎంత తొక్కేస్తే అంతకు మించి బలంగా పైకి ఎదుగుతుందని గత 30 సంవత్సరాల చరిత్ర నిరూపించిందన్నారు. 



1985లో సుందరయ్య చనిపోయే నాటికి నూతన ఆర్ధికవిధానాలు ప్రారంభం కాలేదన్నారు. దానికిముందు 1920-29 మధ్య కమ్యూనిజాన్ని బలంగా తొక్కేయాలని చూసినప్పుడు వీరోచిత పోరాటాలు సుందరయ్య చేశారని గుర్తు చేశారు. బ్రిటీష్‌వారు పూర్తిగా భారతదేశంలో కమ్యూనిజాన్ని రానీయకుండా అణచివేసేందుకు గట్టి చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. 3 ప్రధాన కేసులను పెట్టి దేశంలో ఎవరైతే కమ్యూనిస్టు అనే పేరును ఉచ్ఛరిస్తారో వారందరిపై ఆ కేసులు పెట్టారని తెలిపారు. అయితే అదే సమయంలో ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం ఉధృతంగా బలంగా ముందుకొచ్చిందన్నారు. భారతదేశంలో కమ్యూనిజాన్ని అడుగు కూడా పెట్టనీయకూడదని అనుకున్న బ్రిటీష్‌ వారివల్లే సాధ్యంకాలేదని, అలాంటిది కమ్యూనిజాన్ని నిరోధించాలనుకోవడం మోడి తరం కాదని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. భారతదేశంలో బిజెపి ప్రభుత్వం గత పదేళ్ళలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించిందన్నారు. రాజ్యాంగ హక్కులను తుంగలో తొక్కి భారతదేశంలో ఆర్‌.ఎస్‌.ఎస్‌ భావజాలాన్ని వ్యాపింపచేయాలన్న కుట్రలను అడుగడుగునా లౌకిక, ప్రజాతంత్ర వాదులు అడ్డుకుంటునే ఉన్నారన్నారు. దేశంలో ప్రజాస్వామ్యానికి ఏర్పడి ప్రమాదాన్ని ఈ పదేళ్ళలో ప్రజలు చూసినందువల్లే ప్రతి చర్యను ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. మతోన్మాదుల నుండి, పెట్టుబడిదారుల నుండి ఈ దేశాన్ని రక్షించుకోవడానికి కమ్యూనిస్టులు, లౌకిక, ప్రజాస్వామ్యవాదుల బలం పుంజుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ సెమినార్‌లో అల్లూరి విజ్ఞాన కేంద్రం ట్రస్టీ కార్యదర్శి డాక్టర్‌ బి.గంగారావు అధ్యక్షత వహించగా, ఉత్తరాంద్ర అభివృద్ధివేదిక ప్రధాన కార్యదర్శి ఎ.అజశర్మ, ట్రస్టీ సభ్యులు రెడ్డి వెంకటరావు, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఆర్‌.కె.ఎస్‌.వి.కుమార్‌, బి.ఈశ్వరమ్మ, బి.జగన్‌లు పాల్గొన్నారు.