రైతులు పండించిన అన్ని పంటలకు స్వామినాథన్ కమిటీ సిఫారసులు అమలు చేయాలి.
వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల విధానం రద్దు చేయాలి.
విజయవాడ యంపి కేశినేని శివనాథ్కు విజ్ఞప్తి చేసిన రాష్ట్ర రైతు సంఘాల సమన్వయ సమితి.
విజయవాడ: జాతీయ స్థాయిలో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి ప్రభుత్వం 2020-21 రైతు ఉద్యమం సందర్భంగా వ్రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలనే ప్రధాన డిమాండ్లతో గురువారం విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్, మాజీ వ్యవసాయ శాఖామంత్రివర్యులు వడ్డే శోభనాద్రీశ్వరరావు నేతృత్వంలో పలు రైతు సంఘాల రాష్ట్రస్థాయి నేతలు పూర్తి వివరాలతో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు, యంపి కేశినేని శివనాధ్ కి రైతుల డిమాండ్ల్ లను వివరించారు. 2020-21 రైతుల ఉద్యమం సందర్భంగా కేంద్రం నూతనంగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలను నిలుపుదల చేయాలన్నారు.
రైతులు పండించిన పంటలకు వ్యవసాయ ఉత్పత్తి ఖర్చుల మీద 50శాతం అదనంగా కలిపి రైతులు పండించిన అన్ని పంటలకు మద్దతు ధరలు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల విధానం రద్దు చేయాలని కోరారు. విద్యుత్ ప్రైవేటీకరణ చట్టం 2022 రద్దు చేయాలని, వ్యవసాయ సంబంధిత ఉపకరణాలైనటువంటి ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు, విద్యుత్ శక్తి, పెట్రోల్ ఉత్పత్తులు, ట్రాక్టర్లు సంబంధిత వాహనాలపై జిఎస్టి రద్దు చేయాలని కోరారు. రైతు అనుకూలమైన భూసేకరణ చట్టం 2013 అమలు చేసేటప్పుడు ప్రతి సంవత్సరం పెరిగే భూమి ధరలను పరిగణనలోకి తీసుకుని అమలు చేయాలని, రైతులు, వ్యవసాయ కార్మికులకు ఒకసారి రుణ విముక్తి కలిగించాలని వివరించారు. ఢీల్లీ రైతు ఉద్యమ పోరాటంలో చనిపోయిన 736 మంది రైతులకు జ్ఞాపకార్ధం స్మారక స్థూపం ఏర్పాటు చేయాలని, రైతు ఉద్యమ పోరాటంలో రైతులపై పెట్టిన కేసులన్నీ కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. తదితర డిమాండ్లను నేటికీ కేంద్ర ప్రభుత్వం అమలు చేయకపోవటం బాధాకరమని అన్నారు. దీనిపై విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ స్పందిస్తూ రైతు సంఘాల సమన్వయ సమితి ఇచ్చిన ప్రధాన డిమాండ్లను పార్లమెంటు దృష్టికి, కేంద్ర వ్యవసాయ మంత్రి దృష్టికి తీసుకు వెళ్ళి పరిష్కరించే దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు వై.కేశవరావు, సాగునీటి వినియోగదారుల సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు ఆళ్ళ వెంకట గోపాలకృష్ణారావు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి కుర్రా నరేంద్ర, కార్యనిర్వాహక కార్యదర్శి గుండపనేని ఉమావర ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర నాయకులు సింహాద్రి ఝాన్సీ, ఎం.యలమందారావు, మరీదు ప్రసాద్ బాబు, పి.వి.ఆంజనేయులు, చల్లపల్లి విజయ, దడాల సుబ్బారావు, కోగంటి కోటయ్య, గణేష్ బాబు, లాం జై బాబు తదితరులు పాల్గొన్నారు.