అమరావతి: గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అక్రమాలపై ఏపీ సీఐడీ కూపీ లాగుతోంది. అక్రమాలు జరిగిన తీరుపై అధికారుల నుంచి వివరాలు సేకరిస్తోంది. విచారణలో భాగంగా మద్యం అక్రమాల్లో అప్పట్లో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీతో పాటు, డిస్టిలరీల కమిషనర్‌గా పని చేసిన వాసుదేవ రెడ్డి పాత్రపై సంచలన వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీతో పాటు, డిస్టిలరీల కమిషనర్‌గా జగన్ ప్రభుత్వం ఆయనకు బాధ్యతలు అప్పగించింది. ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, కమిషనర్ లకు ఫైళ్లు పంపకుండా నిర్ణయాలు తీసుకునేలా అధికారాలు ఇచ్చింది.
ఉన్నతాధికారులను బదిలీ చేయించగలనంటూ వాసుదేవరెడ్డి బెదిరించినట్లు ఆరోపణలు వచ్చాయి. మద్యం కొనుగోళ్లలోనూ భారీగా అవకతవకలకు ఆయన తెరలేపారు. ఒకే రకమైన బ్రాండ్ మద్యాన్ని తెలంగాణ కంటే అధిక ధరకు కొనుగోలు చేసినట్టు విచారణలో సీఐడీ గుర్తించింది. వాసుదేవ రెడ్డి చేసిన అక్రమాలు అంచనాకు అందడం లేదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. బినామీ పేర్లతో కొన్ని డిస్టిలరీ వ్యాపారాల్లోకి ఆయన చొరబడినట్లు సీఐడీ చెబుతోంది. తక్కువ రేటు బ్రాండ్‌లను జగన్ ప్రభుత్వం గణనీయంగా తగ్గించేసింది. 2014-2019 మధ్యలో తక్కువ రేటు ఉన్న మద్యం బ్రాండ్‌లు 32 అందుబాటులో ఉంటే.. వాటిని వైకాపా ప్రభుత్వం రెండుకి కుదించింది. వాటినే అధిక ధరలకు విక్రయించి జగన్ ప్రభుత్వం సొమ్ము చేసుకుందని సీఐడీ అధికారులు ఆరోపించారు. కొన్ని ప్రీమియం బ్రాండ్‌ల తరహాలోనే పేర్లు పెట్టి.. మద్యం ఉత్పత్తి, విక్రయాలు చేసినట్లు గుర్తించారు. జే బ్రాండ్ మద్యాన్నీ అధిక ధరలకు అమ్మి జగన్ ప్రభుత్వం సొమ్ము చేసుకునట్లు నిర్ధరించారు. సబ్ లీజుల పేరుతో 11 డిస్టిలరీలను జగన్ అనుచరులు హస్తగతం చేసుకున్నట్లు విచారణలో సీఐడీ గుర్తించింది. జే గ్యాంగ్ హస్తగతం చేసుకున్న డిస్టిలరీల నుంచే 65 శాతం మేర వాసుదేవరెడ్డి మద్యం కొనుగోళ్లు చేశారు. 2014-19 మధ్య కాలంలో ఉన్న టాప్ 5 బ్రాండ్ల మద్యాన్ని 2019 తర్వాత కొనడం ఆపివేశారు. అప్పుల చెల్లింపుల కోసం మద్యం ఆదాయాన్ని, ఏపీ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌కు రూ.14,276 కోట్లు మళ్లించినట్టు గుర్తించారు.