ఐ అండ్ పి.ఆర్. డైరెక్టర్ హిమాంశు శుక్లాను కలిసిన ఫెడరేషన్ నాయకులు
ఆంధ్రప్రదేశ్ సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హిమాన్షు శుక్లాను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ నాయకులు ఈరోజు ఉదయం 12 గంటలకు ఐ & పి.ఆర్ కార్యాలయంలో గల ఆయన ఛాంబర్లో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులకు సంబంధించి వివిధ సమస్యల్ని డైరెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
వివిధ రకాల నిబంధనలను సడలించి అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇవ్వాలని, హెల్త్ కార్డుల్ని ఇన్ టైం లో రెన్యువల్ చేయాలని, చిన్న పత్రికల విషయంలో జియస్టీ మినహాయింపు యివ్వాలని, జర్నలిస్టులకు పెన్షన్ విధానాన్ని అమల్లోకి తేవాలని, అక్రెడిటేషన్ కమిటీలో ఫెడరేషన్ కు అవకాశం కల్పించాలని, ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ళస్థలాలు కేటాయించాలని, అర్హులై వుండి దరఖాస్తు చేసుకోని జర్నలిస్టులకు కూడా ఇళ్ళస్థలాల కేటాయింపు విషయం పునరాలోచించాలని, జర్నలిస్టులకు ప్రతి యేటా ఇచ్చే అవార్డుల్ని ప్రకటించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఆంజనేయులు, అధ్యక్షులు ఎస్. వెంకట్రావు స్పష్టంగా డైరెక్టర్ హిమాన్షు శుక్లాకు వివరించారు. డైరెక్టర్ను కలిసిన వారిలో ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్టింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్(ఏపీబీజేఏ) రాష్ట్ర కన్వీనర్ వి.శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు కలిమిశ్రీ, కార్యదర్శి ఎం.బి. నాధన్, ఏపీడబ్ల్యుజేఎఫ్ వెస్ట్ కమిటీ కార్యదర్శి ఉదయ ఫణికుమార్, ఏపీడబ్ల్యుజేఎఫ్ నాయకులు అబ్దుల్ హలీమ్, సురేష్ బాబు కుర్రా, పటౌడి, కొండబాబు, ఆనంద్, బాషా తదితరులు పాల్గొన్నారు.