విశాఖ జిల్లా
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ పరిశీలించారు. పోలీస్ కమిషనర్ ఎస్. బాగ్చి, జాయింట్ కలెక్టర్ కె. మయూర్ అశోక్, ఇతర అధికారులతో కలిసి మెడ్ టెక్ జోన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పర్యటించారు. ఈ క్రమంలో మెట్ టెక్ జోన్ ప్రతినిధులు, ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించనున్న ప్రధాన మీటింగ్ హాలు, వర్చ్యువల్ విధానంలో జరిగే సీఐఐ సదస్సుకు సంబంధించిన హాలును పరిశీలించారు. అనంతరం పక్కనే ఉన్న టెస్లా హాలును పరిశీలించి అక్కడ జరుగుతున్న ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. టెస్లా హాలులో సీఐఐ ప్రతినిధులు, ప్రముఖులతో ప్రత్యేకంగా భేటీ కానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. అనకాపల్లి జిల్లా పర్యటన అనంతరం హెలికాప్టర్ ద్వారా గురువారం మధ్యాహ్నం 1.50 గంటలకు మెడ్ టెక్ జోన్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు ముఖ్యమంత్రి చేరుకోనున్న నేపథ్యంలో అక్కడ ఏర్పాట్లను కూడా కలెక్టర్ పరిశీలించారు. చుట్టూ బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని, సమీప ప్రాంతంలో వాహనాల పార్కింగ్ సదుపాయం కల్పించాలని అధికారులకు చెప్పారు. యుద్ధప్రాతిపదికన పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, హెలి ప్యాడ్ సమీపంలోని కంచె తుప్పులను తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. హెలి ప్యాడ్ నుంచి నేరుగా మెడ్ టెక్ జోన్ ప్రధాన స్థావరానికి ముఖ్యమంత్రి రోడ్డు మార్గం ద్వారా చేరుకుంటారు. కలాం కన్వెన్షన్ సెంటర్ కేంద్రంగా పలు కార్యక్రమాల్లో భాగస్వామ్యమవుతారు. టెస్లా హాలులో సీఐఐ ప్రతినిధులు, ఇతర ప్రముఖులతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. అనంతరం పక్కనే ఉన్న ఒమేగా మీటింగ్ హాలులో మెడ్ టెక్ జోన్ ప్రతినిధులు, ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహించి వారితో నేరుగా మాట్లాడతారు. తరువాత మెడ్ టెక్ జోన్ పరిధిలో కలాం కన్వెన్షన్ సెంటర్కు వంద మీటర్ల సమీపంలో ఉన్న వైద్య పరికరాల తయారీకి సంబంధించిన రెండు కంపెనీ భవనాలను ప్రారంభిస్తారు. ఈ క్రమంలో ప్రధాన కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను సీపీ, ఇతర అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ఎక్కడా ఎలాంటి లోపాలు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని ఈ సందర్భంగా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. పలు అంశాలపై సమీక్షించి మార్గదర్శకాలు జారీ చేశారు. అందరూ సమన్వయం చేసుకొని ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. అనంతరం అక్కడ నుంచి బయలు దేరి ఎయిర్ పోర్టు ఎగ్జిక్యూటివ్ లాంజ్ వద్ద జరగనున్న సమీక్షా సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. జాయింట్ పోలీస్ కమిషనర్ కె. ఫక్కీరప్ప, డీసీపీ ఎం. సత్తిబాబు, ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, మెడ్ టెక్ జోన్ ప్రతినిధులు, సీఐఐ ప్రతినిధులు, ఇతర జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు.