విశాఖపట్నం
రేపు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం
అల్పపీడనం ప్రభావంతో కోస్తాంధ్రలో రాబోయే మూడు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు స్టెల్లా తెలిపారు.
ఈ నెల 19న మరో అల్పపీడనం ఏర్పడుతుందన్నారు. రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయన్నారు. వర్షాల నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ సూచించారు. గురువారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందన్నారు. అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ నంబర్లు 1070, 112, 18004250101 లను సంప్రదించాలని సూచించారు. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, ఏలూరు, శ్రీసత్యసాయి తదితర జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 44.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.