9న కార్మిక, కర్షకుల నిరసన...బహుళ జాతి కంపెనీలను తరిమికొట్టండి... కార్మిక కర్షక సంఘాల జిల్లా సమన్వయ సమితి పిలుపు...
విజయవాడ: ఆగస్టు 9వ తేదీన జాతీయ కార్మిక, కర్షక సంఘాల పిలుపుమేరకు విజయవాడ లెనిన్ సెంటర్లో ఉదయం 10 గంటల నుంచి బహుజాతి కంపెనీలను దేశం నుంచి తరిమికొట్టాలని పిలుపునిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టాలని ఎన్టీఆర్ జిల్లా కార్మిక, కర్షక సంఘాల సమన్వయ సమితి నిర్ణయించింది. ఈ మేరకు దాసరిభవంలో బుధవారం సాయంత్రం సమావేశం జరిగింది. బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కేంద్ర బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొండి చేయి చూపించాయి. బహుళ జాతి కంపెనీలకు పెద్దపీట వేశాయి. వ్యవసాయ రంగంలో బహుళ జాతి కంపెనీల ప్రవేశాన్ని కార్మిక, కర్షక సంఘాల వ్యతిరేకించాయి. వ్యవసాయ రంగంలో విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ ఇతర అన్ని రంగాల్లోనూ బహుళ జాతి కంపెనీల ప్రవేశంతో వ్యవసాయ రంగంలో తీవ్రంగా రైతాంగం నష్టపోతున్నారు. బహుజాతి కంపెనీలు వ్యవసాయ ఉత్పత్తిని పదిరెట్లు ధరలతో అదే రైతాంగానికి, విక్రయిస్తున్నారు. కంపెనీలో తయారయ్యే వస్తువులు అధిక జీఎస్టీతో రైతాంగము, ప్రజలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశానికి అన్నం పెట్టే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని, అనేక రాయితీలు, రుణాలు బహుళజాతి కంపెనీలకు ప్రభుత్వం అందిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతాంగానికి మాత్రం రుణమాఫీ లేదు, విత్తన చట్టం లేదు, కనీస మద్దతు ధర నిర్ణయించలేదు, రైతుల డిమాండ్లను కనీసం కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదు. రైతు సంఘాల డిమాండ్లు ఒక్కటి కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించలేదని నాయకులు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశీయ వ్యవసాయాన్ని, దేశీయ పరిశ్రమల్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేస్తూ, కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని, బహుళ జాతి కంపెనీలను వ్యవసాయ రంగంలో ప్రవేశాన్ని నిరసించాలని, రైతుల డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆగస్టు 9వ తేదీన విజయవాడ లెనిన్ సెంటర్లో ఉదయం 10 గంటల నుంచి నిరసన కార్యక్రమం చేపట్టాలని సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నాయకులు వై. యలమందరావు, పి.ఆంజనేయులు, యు.వీరబాబు, మరీదు ప్రసాద్ బాబు, కార్మిక సంఘాల నాయకులు పి పోలారి, ఏవి వెంకటేశ్వరావు, దుర్గారావు, రవిచంద్ర, రాజేష్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.