జగనన్న ఇళ్ళకాలనీల భూముల సేకరణలో కీలకపాత్ర పోషించిన ప్రజాప్రతినిధులు ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు అనువైన చోట కాకుండా వారికి ముడుపులు వచ్చే ప్రాంతంలోనే స్థలాలు సేకరించారు.
ఇందుకు రెవెన్యూ అధికారులు అన్ని విధాలుగా సహకారం అందించారు. తెనాలి నియోజకవర్గంలో సుమారు 500ఎకరాలకుపైగా భూమి సేకరించి అప్పటి ప్రజాప్రతినిధి ముందస్తు ప్రణాళిక ప్రకారం రైతుల నుంచి తక్కువ ధరకు అనుచరుల చేత భూములు కొని ప్రభుత్వానికి ఇచ్చి పెద్దఎత్తున లబ్ధిపొందారు. పట్టణానికి దూరంగా ఉన్నప్పటికీ లబ్ది కలుగుతుందని భూములు కొనుగోలు చేశారు. బాబు హయాంలో 2019 లో రాజధాని అమరావతి నిర్మాణం అవుతుందన్న విశ్వాసంతో తెనాలి చుట్టుపక్కల పొలాల ధరలు అమాంతం పెరిగాయి. ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం భూముల విలువ పెంచింది.పిదప జగన్ హయాంలో అమరావతి నిర్మాణం ఆగిపోవడంతో YCP పాలనలో ఇక్కడి భూముల ధరలు బహిరంగ మార్కెట్‌లో క్షీణించాయి. బహిరంగ మార్కెట్ కంటే ప్రభుత్వపరంగా ఇక్కడి భూముల విలువ ఎక్కువగా ఉండటం ప్రజాప్రతినిధికి కలిసొచ్చింది. బహిరంగ మార్కెట్ కంటే ప్రభుత్వం ఎక్కువ ధర చెల్లిస్తుండటంతో రైతులు ఎక్కువ మంది భూములు ఇవ్వడానికి ఆసక్తి చూపారు. ఇదే అదనుగా ప్రజాప్రతినిధి చక్రం తిప్పి సొమ్ము చేసుకున్నారు. లోతట్టు ప్రాంతాల్లో భూములు సేకరించిన తర్వాత చదును పేరుతోనూ బుసకతో రూ.కోట్లు వెచ్చించారు. ఇక్కడ కూడా చేతివాటం ప్రదర్శించి రూ.కోట్లు కొల్లగొట్టారు. ప్రస్తుతం కొత్త తహశీల్దార్లు వచ్చినందున అప్పటి రికార్డులు పరిశీలించి అక్రమాలు నిగ్గుతేల్చాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తహశీల్దార్ల బదిలీలు పూర్తయి పాలన గాడినపడటంతో అక్రమాలు నిగ్గుతేల్చి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న ఆలోచనతో ప్రజలున్నారు.