సింహాచలంలో స్థలం కోసం బ్రహ్మ కుమారీస్ సంస్థ వినతి

సింహాచలంలో స్థలం కోసం బ్రహ్మ కుమారీస్ సంస్థ వినతి- సిఎం చంద్ర బాబు నాయుడు తో భేటీ అయిన రామేశ్వరి 



అమరావతి:  ప్రజాపిత బ్రహ్మకుమారీస్ విశాఖపట్నం లోని అన్ని సేవా కేంద్రాల వారి తరఫున బీ.కే. రామేశ్వరి మంగళ వారం అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడును కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ , విశాఖపట్నంలోని సింహాచలం పుణ్యక్షేత్రంలో లక్షలాదిమంది భక్తులకు సందర్శనార్థం తాము ఒక ఆధ్యాత్మిక పరమైన మ్యూజియంను నిర్మించాలని సంకల్పించుకున్నాము అన్నారు. ఈ ఆధ్యాత్మిక మ్యూజియం నందు సనాతన ధర్మాన్ని అద్దం పట్టే విధముగా దేవతల విగ్రహాలతో పాటు, సామాజిక నైతిక విలువలు తెలియచేసే విధంగా అన్ని వయసుల వారికి ఆత్మజ్ఞానాన్ని బోధించుటకు సుందరమైన చిత్రాలను అమర్చాలనుకుంటున్నాము. చదువుకునే విద్యార్థులకు సైన్స్ పరమైన ఆధ్యాత్మికతను కలిపి జ్ఞాన విజ్ఞానమును బోధించుటకు మరిన్ని చిత్రాలను ఏర్పాటు చేయదలచుకున్నాము అన్నారు. 



భక్తులకు వైద్య సౌకర్యార్థం ఒక చిన్న చికిత్సాలయమును, ప్రధమ చికిత్స కొరకు రెండు గదులతో ఏర్పాటు చేయదలుచుకున్నాము. వీటి నిర్మాణం కొరకు మన రాష్ట్ర ప్రభుత్వం వారి నుండి సింహాచలం కొండ దిగువ ప్రాంతంలో భక్తులు మెట్లుఎక్కే చోట ఒక వెయ్యి గజాలను తమ సంస్థకు ఇప్పించవలసిందిగా కోరారు. ప్రభుత్వం వారు దయచేసి వెయ్యి గజాలలో ఆధ్యాత్మిక సంగ్రహాలయాన్ని నిర్మించడమే కాకుండా, ఈ చికిత్సాలయాన్ని కూడా నిర్మించడానికి తమ సంస్థకు దిగువ సింహాచలం ప్రాంతంలో భక్తులకు అనుకూలంగా స్థలాన్ని కేటాయించగలరని ఆశిస్తున్నాము. శారీరక, మానసిక, సామాజిక ఆధ్యాత్మిక నిరంతర సేవలను తాము ప్రజానీకానికి ఉచితంగా అందివ్వగలమని సవినయముగా తెలియజేసుకుంటున్నాము. ఈ సందర్భంగా ఆమె సిఎంను శాలువా తో సత్కరించి, ఆయనకి జ్ఞాపిక అందజేశారు. అనంతరం ఆమె దేవాదాయ ధర్మాదాయ శాఖ రాష్ట్ర కమిషనర్ సత్యనారాయణను కూడా కలిసి, జ్ఞాపిక, వినతి పత్రం సమర్పించారు.