సింహాచలం పుణ్యక్షేత్రం లో జ్ఞాన విజ్ఞాన కేంద్రం ఏర్పాటు

సింహాచలం పుణ్యక్షేత్రంలో జ్ఞాన విజ్ఞాన కేంద్రం ఏర్పాటుకు స్థలం కేటాయించాలి-- ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సంస్థ వినతి



విశాఖపట్నం....ప్రజాపిత బ్రహ్మకుమారీస్ ఈశ్వరియ విద్యాలయం సారధ్యంలో విశాఖలోని సింహాచలం పుణ్యక్షేత్రంలో లక్షలాదిమంది భక్తుల సందర్శనార్ధం “జ్ఞాన విజ్ఞాన కేంద్రం” ఆధ్యాత్మిక మ్యూజియం, ప్రథమ చికిత్సలయం ఏర్పాటు చేయడానికి కావలసిన స్థలం కోసం విశాఖకు గురువారం వస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఒక వినతి పత్రాన్ని సమర్పిస్తున్నామని ప్రజాపిత బ్రహ్మకుమారి సంస్థ నిర్వాహకులు రమాదేవి తెలియజేశారు. గురువారం విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ సింహాచలం దేవస్థానంకు వచ్చే లక్షలాదిమంది భక్తులకు, విద్యార్థులకు,యువతకు సనాతన ధర్మంతో పాటు జ్ఞాన విజ్ఞాన అంశాలు తెలియజేయడానికి ఆధ్యాత్మిక సంగ్రహలయము, భక్తుల ప్రథమ చికిత్స కోసం హాస్పటల్ ఏర్పాటు చేయడానికి తమ ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియా విద్యాలయం మీడియా వింగ్ సర్వీస్ ఒక ఉన్నతమైన నిర్ణయం తీసుకొని గత సెప్టెంబర్ 27న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కలిసి వినతి పత్రం సమర్పించినట్లు తెలియజేశారు. ఇంతే కాకుండా ఇటీవల రాష్ట్ర క్యాబినెట్ మంత్రుల మీటింగ్ సమయంలో ప్రజాపిత బ్రహ్మకుమారీస్ కార్యవర్గం రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రితో పాటు 14 మంది మంత్రులను కలసి తమ ఆధ్యాత్మిక పరమైన మ్యూజియంను నిర్మించడానికి అవసరమైన స్థలాన్ని సింహాచలం దేవస్థానం దిగువ భాగంలో కేటాయించవలసిందిగా నివేదిస్తూ ఒక వినతి పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. రాష్ట్రానికి దేశానికి వన్నె తెచ్చే విధంగా, గర్వకారణంగా నిలిచే విధంగా ఈ ఆధ్యాత్మిక మ్యూజియం సనాతన ధర్మాన్ని అద్దం పట్టే విధంగా వివిధ దేవతల విగ్రహాలతో పాటు, సామాజిక, నైతిక విలువలు తెలియచేసే విధంగా అన్ని వయసుల వారికి ఆత్మజ్ఞానాన్ని బోధించుటకు సుందరమైన చిత్రాలను అమర్చాలనుకుంటున్నామన్నారు. చదువుకునే విద్యార్ధులకు సైన్స్ పరమైన ఆధ్యాత్మికతను కలిపి జ్ఞాన విజ్ఞానమును బోధించుటకు మరిన్ని చిత్రాలను ఏర్పాటు చేయదలచుకున్నామన్నారు. భక్తులకు వైద్య సౌకర్యార్థం ఒక చిన్న చికిత్సాలయమును ప్రధమ చికిత్స కొరకు రెండు గదులతో ఏర్పాటు చేయదలుచుకున్నామన్నారు. వీటి నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం సింహాచలం కొండ దిగువ ప్రాంతంలో భక్తులు మెట్లుఎక్కే చోట ఒక వెయ్యి గజాలను స్థలం మా సంస్థకు ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నామన్నారు. ప్రభుత్వం దయచేసి వెయ్యి గజాలలో ఆధ్యాత్మిక సంగ్రహాలయాన్ని నిర్మించడమే కాకుండా ఈ చికిత్సాలయాన్ని కూడా నిర్మించడానికి దిగువ సింహాచలం ప్రాంతంలో భక్తులకు అనుకూలంగా స్థలాన్ని కేటాయించగలరని ఆశిస్తున్నామన్నారు. శారీరక, మానసిక, సామాజిక ఆధ్యాత్మిక నిరంతర సేవలను ప్రజానీకానికి ఉచితంగా ప్రజాపిత బ్రహ్మకుమారీస్ సంస్థ అందివ్వగలదని తెలిపారు. ముఖ్యంగా స్కూల్స్, కాలేజీలు, యూనివర్సిటీలలో చదువుకుంటున్న విద్యార్థులు, యువతకు సరైన మార్గదర్శకం లేకపోవడంతో గంజాయి వంటి మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, డ్రగ్స్ కు బానిసలుగా మారి తమ విలువైన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, వీరికి సమాజం పట్ల సరైన అవగాహన కల్పించడానికి ఉపయోగపడే విధంగా శారీరక, మానసిక, సామాజిక, ఆధ్యాత్మిక బోధనలు చేసే విధంగా, మంచి మార్గదర్శకం చేసే విధంగా జ్ఞాన విజ్ఞాన కేంద్రం ఆధ్యాత్మిక మ్యూజియం ఎంతో అవసరమన్నారు. పిల్లల తల్లిదండ్రులు ఎంతో డబ్బు వెచ్చించి, ఎన్నో ఆశలు పెట్టుకుని విద్యాసంస్థలకు పంపిస్తుంటే సమాజ విద్రోహ శక్తుల మూలంగా చెడు దారి పట్టి తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సింహాచలం దేవస్థానంలో జ్ఞాన విజ్ఞాన కేంద్రం ఆధ్యాత్మిక మ్యూజియం ఏర్పాటు చేయడం ద్వారా అందరికీ ఉపయుక్తంగా ఉంటుందని ఆమె తెలిపారు. దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి సింహాచలంలో స్థలాన్ని కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో సంఘమిత్ర సోషల్  సర్వీసెస్ సూరిబాబు, బ్రహ్మకుమారిస్ ప్రతినిధి నారాయణమూర్తి, బ్రహ్మకుమారిస్ మణి తదితరులు పాల్గొన్నారు.