పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు...

ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖపట్నం వస్తున్నారు. ఈ సందర్భగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. రహదారి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.



విశాఖపట్నం:, జనవరి 8న ప్రధాని మోదీ విశాఖపట్నం వస్తున్నారు. ఈ సందర్భగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. రహదారి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సుస్థిర పారిశ్రామికాభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా విశాఖపట్నంలో రూ.2 లక్షల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. విశాఖపట్నం సమీపంలోని పూడిమడక వద్ద.. జాతీయ హరిత హైడ్రోజన్‌ మిషన్‌ కింద మొదటి గ్రీన్‌ హైడ్రోజన్‌ హబ్‌... అత్యాధునిక ఎన్‌టీపీసీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌ ప్రాజెక్టుకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.1,85,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. 2030 నాటికి భారత్‌ శిలాజేతర ఇంధన సామర్థ్యం 500 గిగావాట్ల లక్ష్యాన్ని సాధించడంలో ఈ ప్రాజెక్టు గణనీయంగా దోహదం చేస్తుంది. అంతేకాకుండా, రాష్ట్రంలో రూ.19,500 కోట్లకు పైగా విలువైన రైల్వే, రోడ్డు ప్రాజెక్టుల్లో కొన్నింటికి శంకుస్థాపన చేస్తారు. మరికొన్నింటిని ప్రారంభిస్తారు. విశాఖలో దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారు. ఇతర ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేయనున్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో బల్క్‌ డ్రగ్‌ పార్కుకు, తిరుపతి జిల్లాలో చెన్నై- బెంగళూరు పారిశ్రామిక కారిడార్‌ పరిధిలోని కృష్ణపట్నం పారిశ్రామిక నగరం (క్రిస్‌ సిటీ)కు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. నేషనల్‌ ఇండస్ర్టియల్‌ కారిడార్‌ డెవల్‌పమెంట్‌ ప్రోగ్రాంలో భాగంగా క్రిస్‌ సిటీని గ్రీన్‌ ఫీల్డ్‌ ఇండస్ర్టియల్‌ స్మార్ట్‌ సిటీగా తీర్చిదిద్దుతారు. ఈ ప్రాజెక్టు సుమారు రూ.10,500 కోట్ల పెట్టుబడులను ఆకర్షించనుంది.