విశాఖపట్నం ఆర్డీఓపై చర్యలు తీసుకోండి

విశాఖపట్నం ఆర్డీఓపై చర్యలు తీసుకోండి- ఐ అండ్ పిఆర్ మంత్రికి ఏపిఎంఎఫ్ ఫిర్యాదు 



విజయవాడ, ఫిబ్రవరి 20: విశాఖపట్నంలో జరుగుతున్న అవినీతి, భూ అక్రమాలపై వార్తలు రాసిన 'లీడర్' పత్రిక యాజమాన్యానికి ఆర్డీఓ శ్రీలేఖ  వారెంట్ నోటీసు జారీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధానకార్యదర్శి పి. ఢిల్లీబాబు రెడ్డి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధికి ఫిర్యాదు చేశారు. విజయవాడలోని మంత్రి పార్ధసారధి క్యాంపు కార్యాలయంలో గురువారం నాడు ఏపిఎంఎఫ్ బృందం మంత్రిని కలిశారు. ఆర్డీఓ శ్రీలేఖ చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయని ఢిల్లీబాబు రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు కూడా మచ్చ తెచ్చేలా శ్రీలేఖ తన పరిధిలో లేని అధికారాలతో జర్నలిస్టులను బెదిరించడం అప్రజాస్వామికమని ఢిల్లీబాబు రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన మంత్రి పార్ధసారధి ఆర్డీఓ పై ప్రభుత్వపరమైన చర్యలకు సిఫారసు చేస్తానని తెలిపారు. ఏపిఎంఎఫ్ ఫిర్యాదు మేరకు విశాఖపట్నం ఆర్డీఓపై చర్యలు తీసుకోవలసిందిగా రెవిన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆర్.పి. సిసోడియాకు లేఖ రాస్తానని మంత్రి పార్థసారథి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఏపీఎంఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఢిల్లీబాబురెడ్డి వెంట ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్, గోదావరి దినపత్రిక ఎడిటర్ బోళ్ళ సతీష్ బాబు ఉన్నారు.