విశాఖపట్నం ఆర్డీఓపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏపిఎంఎఫ్ ఫిర్యాదు
విజయవాడ, ఫిబ్రవరి 20: విశాఖపట్నంలో జరుగుతున్న అవినీతి, భూ అక్రమాలపై వార్తలు రాసిన 'లీడర్' పత్రిక యాజమాన్యానికి ఆర్డీఓ శ్రీలేఖ వారెంట్ నోటీసు జారీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ప్రధానకార్యదర్శి పి. ఢిల్లీబాబు రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ కు ఫిర్యాదు చేశారు. అమరావతిలోని సచివాలయంలో గురువారం రాత్రి ఏపిఎంఎఫ్ బృందం మంత్రిని కలిశారు. ఆర్డీఓ శ్రీలేఖ చర్యలు పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా ఉన్నాయని ఢిల్లీబాబు రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రతిష్టకు కూడా మచ్చ తెచ్చేలా శ్రీలేఖ తన పరిధిలో లేని అధికారాలతో జర్నలిస్టులను బెదిరించడం అప్రజాస్వామికమని ఢిల్లీబాబు రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆర్డీఓపై విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసిన వారిలో ఏపీఎంఎఫ్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఢిల్లీబాబురెడ్డి వెంట ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్, ఏపిఎంఎఫ్ రాష్ట్ర కార్యదర్శి వాల్మీకి నాగరాజు, ఏపీఎంఎఫ్ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు కే. కిరణ్ కుమార్ ఉన్నారు.