సెక్యూరిటీ గార్డులకు రక్షణ కరువు

సెక్యూరిటీ గార్డులకు రక్షణ కరువు...నెలల తరబడి అందని జీతాలు...బకాయిలు వెంటనే చెల్లించాలి...టియుసిఐ డిమాండ్ 



అమరావతి: ఇటీవల కాలంలో ఉపాధి ఆవకాశాలు మెండుగా ఉన్న రంగం సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా గార్డుల ఉద్యోగాలు మాత్రమే. పెళ్లైనా, పెరంటమైనా, అన్ని శుభ, అశుభ కార్యక్రమాలకు, కంపెనీలో, కళాశాలలో ఒకటేమిటి ఎక్కడైనా ఆవకాశం ఉన్న ఉద్యోగం సెక్యూరిటీ గార్డులు. ఉన్నత విద్యావంతులు సైతం ప్రభుత్వ ఉద్యోగాలు రాకా, ప్రైవేటు కంపెనీల్లో ఆవకాశాలు లేక సెక్యూరిటీ గార్డులుగా చేరిపోతున్నారు. 10వేలు నుంచి 20వేలు వరకు ప్రతి నెల ఆదాయం సమకూర్చుకోగలుగుతున్నారు. వివిధ కంపెనీలు, కళాశాలల యాజమాన్యం సెక్యూరిటీ ఏజెన్సీల ద్వారా గార్డులను రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. విద్యార్హత, వయస్సు మాత్రమే కొలమానంగా చూస్తున్నారు. క్రమశిక్షణ, నేరచరిత్ర లేదని పోలీసు శాఖ ద్వారా ఆమోదపత్రం పొందవలసి ఉంటుంది. ప్రతిచోట సిసి కెమెరాలతో పాటు రక్షణ కవచంగా, నిరంతరం నిఘా నిర్వహించేది ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు. అందరికి రక్షణ కల్పించే వీరికి రక్షణ కరువుగా ఉంది. పని ప్రదేశాల్లో మహిళలు మరింత దయనీయమైన పరిస్థితులు ఏదుర్కొంటున్నారు. చాలి చాలని జీతాలు అందుకోవలసి వస్తుంది. అవి కూడా సక్రమంగా నెలవారీ అందటం లేదు. ఇల్లు గడవక, పిల్లల చదువుకు, కుటుంబ పోషణకు, ఆడపిల్ల పెళ్లి ఖర్చులు అవసరాల కోసం సెక్యూరిటీ గార్డుల అవతారం ఎత్తిన వృద్ధులు, మహిళలు, యువతి, యవకులు చాలా మంది ఉన్నారు. వారు విధులు నిర్వహించే సంస్థల్లో, పని ప్రదేశాల్లో చోరీలు, హత్యలు, అసాంఘీక కార్యక్రమాలు ఏమీ జరిగిన ముందు బలైయ్యేది సెక్యూరిటీ గార్డులే. ముందు నుయ్యి, వెనుక గోయ్యిలాగా వారి పరిస్థితి ఉంది. పొట్టకూటి కోసం తిప్పలు తప్పటం లేదు. లేదంటే ఆధుకునే నాథుడు కరువయ్యే. అన్నమో రామచంద్రుడా అంటూ చేయకతప్పటం లేదు. వేరే గత్యంతరం కూడా కానరాని పరిస్థితిలో సెక్యూరిటీ గార్డులుగా దినదిన గండం, నూరేళ్లు ఆయుష్ గా బతికీడుస్తున్నారు. 

ఇదిలా ఉండగా ఏజెన్సీలు సక్రమంగా జీతాలు అందించటం లేదు. ఏజెన్సీ కమిషన్లు నొక్కుడు కూడా అధికంగా ఉంది. నిర్వహాణ సంస్థలు సెక్యూరిటీ గార్డులకు ఇచ్చే కాంట్రాక్టు ఒకలా ఉంటుంది. గార్డులకు జీతాలు చెల్లింపులు మరింత తగ్గింపుగా ఉంటాయి. ఉదాహరణకు మచిలీపట్నం మెడికల్ కళాశాలలో 20 మంది సెక్యూరిటీ గార్డులు పని చేస్తున్నారు. వారికి కళాశాల కాంటాక్ట్ పద్ధతిలో చెల్లింపులు కనీసం 15 వేలు చోప్పున చెల్లిస్తారు. కానీ గార్డులకు కేవలం 10వేలు మాత్రమే చెల్లిస్తారు. ఒక్కొక్క సెక్యూరిటీ గార్డు నుంచి నెలవారీ 5 వేలు కమిషన్ కార్తీకేయ ఏజెన్సీ మినహాయించుకుంటుంది. అంతేకాక పిఎఫ్, ఈఎస్ ఐ కటింగ్ చేసి ఆయా సంస్థలకు గార్డుల పేరు మీదా చెల్లించాల్సి ఉంటుంది. ఆ చెల్లింపులు వందల్లో ఉంటాయి. గార్డుల జీతాల్లో మాత్రమే వేలల్లో కటింగ్ చేస్తారు. సెక్యూరిటీ గార్డుల దోపిడీ యద్థేశ్ఛగా సాగుతుంది. ఏజెన్సీ నిర్వహాకుల వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. కాంటాక్ట్ వివిధ సంస్థల నుంచి రాబట్టుకునే వరకే ఏజెన్సీ గొప్పతనం. ఆ తరువాత నిరుద్యోగులు శ్రమదోపిడీకి బలికావలసిందే. అయిన తప్పదు బతుకుదెరువు కోసం చేయకతప్పని పరిస్థితి. మచిలీపట్నం మెడికల్ కళాశాల కార్తీకేయ ఏజెన్సీ సంబంధిత సెక్యూరిటీ గార్డులకు అయిదు నెలలుగా అసలు జీతాలే చెల్లించటం లేదు. కళశాల యాజమాన్యం అడిగితే ఏజెన్సీకి చెల్లించామంటారు. ఏజెన్సీ వారు కళాశాల నుంచి నిధులు అందలేదంటారు. ఏదురు పెట్టుబడి పెడుతూ, కుటుంబ పోషణకు అప్పుల పాలౌతు సెక్యూరిటీ గార్డులు జీతాల కోసం అయిదు నెలలుగా వెయ్యి కళ్లతో ఏదురు చూస్తున్నారు. కానీ ఆరో నెల వచ్చిన జీతాలు రాని పరిస్థితి. ఈ సమాచారం ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా(టియుసిఐ) రాష్ట్ర కమిటీ కి తెలియజేశారు. ఈ మేరకు గార్డుల పరిస్థితి పరిశీలించగా కడుదయనీయంగా, హృదయవీదారకంగా వారి కుటుంబ పరిస్థితులు ఉన్నాయని వెలుగులోకి వచ్చాయి. త క్షణమే మచిలీపట్నం మెడికల్ కళాశాల సెక్యూరిటీ గార్డులకు కార్తికేయ సెక్యూరిటీ ఏజెన్సీ తక్షణమే బకాయిలు చెల్లించాలని టియుసిఐ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు డిమాండ్ చేస్తున్నారు.