మే 20న జాతీయ సమ్మె

లేబర్ కొడ్స్ రద్దు కోరుతూ..మే 20న జాతీయ సమ్మె...

రాష్ట్ర సదస్సులో.. కార్మిక నేతల పిలుపు 



విజయవాడ: బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలుకు పూనుకుంటున్న నాలుగు లేబర్ కొడ్స్ రద్దు చేయాలని కేంద్ర కార్మిక సంఘాల రాష్ట్ర నేతలు పిలుపునిచ్చారు. శుక్రవారం మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సులో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నర్సింగ్ రావు మాట్లాడుతూ భారత రాజ్యాంగం లోని పలు చట్టాలను స్వదేశీ, విదేశీ బడా కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చేందుకు చట్టాల సవరణలు, రద్దు చేస్తున్నారని వివరించారు. అందులో భాగంగానే పారిశ్రామిక రంగంలో ఉన్న 44 కార్మిక చట్టాలను రద్దు చేసి, నాలుగు లేబర్ కొడ్స్ గా రూపొందించారని, చట్టసభలో మేజార్టీ పేరుతో ఆమోదం పొందారని ఆవేదన వ్యక్తం చేశారు. 



లేబర్స్ కొడ్స్ అమలు వలన గతంలో వలె యూనియన్లు పెట్టుకునే హక్కు, సమ్మె చేసే హక్కు, 8 గంటల పనివిధానం కోల్పోతామని విచారం వ్యక్తం చేశారు. కార్మికులు పోరాడి సాధించిన చట్టాలను, హక్కులను కోల్పోతున్నామని, అందుకే లేబర్ కొడ్స్ రద్దు కోసం మే 20న మరో సమరశీల పోరాటం కార్మికవర్గం నిర్వహించాలని, అన్ని రంగాల కార్మికులకు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు మాట్లాడుతూ లేబర్ కొడ్స్ అమలు వలన కార్మికులు వెట్టిచాకిరికీ బలైతారన్నారు. ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, ఈపిఎఫ్, కనీస వేతనాలు, పోరాడే హక్కులు కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. తద్వారా కార్మికుల సంక్షేమం, అభివృద్ధి కుంటుపడి కుటుంబాలు కూడా వీధినపడతాయన్నారు. లేబర్ కొడ్స్ రద్దు చేయాలని ఉద్యమించక తప్పనిపరిస్థితని కార్మిక లోకానికి విజ్ఞప్తి చేశారు. వైఎస్ ఆర్ సిపి ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పూనూరి గౌతం రెడ్డి మాట్లాడుతూ కార్మిక వ్యతిరేక చట్టాలు, విధానాలు గత కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కూడా అమలు చేయాలని ప్రయత్నాలు జరిగితే కార్మికుల సంఘటిత పోరాటాల ద్వారా తిప్పికొట్టగలిగామని, ఆనాడు నిలుపుల చేయగలిగామన్నారు. నేడు మళ్ళీ బిజెపి శ్రామిక వర్గ ప్రయోజనాలకు వ్యతిరేకంగా లేబర్ కొడ్స్ తీసుకొని వచ్చి అమలుకు పూనుకుంటుందని, వాటిని రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కార్మికులు నిర్వహించే సమ్మెకు తమ సంపూర్ణ మద్ధతు ఉంటుందని ప్రకటించారు. సభకు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించి, మే 20న దేశవ్యాప్త కార్మిక సమ్మెకు సంబంధించిన డిమాండ్ల్ తో కూడిన తీర్మానం ప్రవేశపెట్టారు. సమ్మె జయప్రదం కోసం నిర్వహించవలసిన ముందస్తు కార్యక్రమాలను వివరించారు. వాటిని సదస్సుకు హాజరైన కార్మికులు ఆమోదించారు. ఇంకా ఈ రాష్ట్ర సదస్సులో ఐఎఫ్ టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.పోలారీ, ఏఐఎఫ్ టియు రాష్ట్ర కార్యదర్శి జాస్తి కిషోర్ బాబు, ఏఐసిటియు రాష్ట్ర అధ్యక్షులు సుధీర్, ఐఎఫ్ టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం. రామకృష్ణా, టియుసిఐ రాష్ట్ర అధ్యక్షులు మరీదు ప్రసాద్ బాబు, సిఐటియు రాష్ట్ర నాయకులు సుబ్బరావమ్మా, ధనలక్ష్మి, ఏవి నాగేశ్వరావు, విజయ్ కుమార్, అజయ్ కుమార్, కె. ఉమామహేశ్వరరావు, ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు కె. రవీంద్రనాథ్, రైల్వే, బ్యాంక్, ఎల్ ఐసీ, మెడికల్ తదితర రంగాల యూనియన్ రాష్ట్ర నాయకులు కూడా ప్రసంగించారు. రైతు సంఘాలను, కలిసి వచ్చే అన్ని యూనియన్ లను, వ్యక్తులను, శక్తులను కలుపుకొని సమ్మెను రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల, గ్రామ, పారిశ్రామిక కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించి కార్మికులను, అన్ని వృత్తుల శ్రామికులను భాగస్వాములను చేయాలని సదస్సు లో పాల్గొన్న కార్మిక నేతలు పిలుపునిచ్చారు. తొలుత సదస్సులో వక్తలను వేదికపైకి ఏఐటీయూసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి వెంకట సుబ్బయ్య ఆహ్వానించారు. ప్రజానాట్యమండలి కళాకారులు లేబర్ కొడ్స్ వలన కార్మికుల ప్రయోజనాలకు జరిగే నష్టాలపై పాటలు పాడి వినిపించారు.